తల్లి తెలంగాణ తల్లడిల్లె ,
వెక్కెక్కి ఏడ్చి సోమ్మసిల్లె,
నేల కొరిగిన బిడ్డల జూసి ,
ఆ గుండె పగిలిపోయే.
ఎన్ని పోరాటాలు,ఎన్ని త్యాగాలు,
ఎన్నెన్ని సార్లు బిడ్డల బలిదానాలు ,
నాటి రాజకార్లనే తరిమికొట్టి
నేటి సీమంధ్ర సంకెళ్ళలో ఆర్తనాదాలు.
నమ్మజెప్తివి, నమ్మజూపితివి
పెద్దమనుషుల మాట తుంగలో తోక్తివి ,
ఇస్తామంటివి ,చేస్తామంటివి,
మా కొలువులు బాజప్తుగా కాజేస్త్తివి.
కర్నూల్ మునిగినా పర్లేదు,
నల్గొండకు మాత్రం నీల్లోదలనంటివి,
మా బతుకులు బుగ్గిపాలు జేసి,
కొత్తగూడం బొగ్గు నీకంటివి.
భద్రాద్రి రామయ్య మనవి వినవయ్య,
నాటి రావణుని మొండానికి పది తలలయ్యా ,
తెలంగాణ సీతను దోచుకెళ్ళే నేడు ,
పదమూడు రావణులుకు ఒకటే తలయ్య.
వేములవాడు రాజన్న గోడు వినవయ్యా,
తల్లి గుండె మీద కర్కశంగా కాళ్ళుబెట్టి,
విరగబడి నవ్వాడు చూడవయ్యా,
వాడు పరుగుదీస్తూ పరిహసిస్తాడు కనవయ్యా.
ఏడుకొండల సామి ,ఎంకన్న స్వామీ,
నీకు పిల్ల నిచ్చిన నేల యిది సామి,
నీ మామదా ,నిజాం దా,అని విర్రవీగుతున్నాడు,
కళ్ళల్లో కారం గొట్టి కలిసుందాం అంటుండ్రు .
యాదగిరి నరసింహ ,ఆపద్భాన్దవా ,
ప్రహ్లాదులం మేము,నిన్ను కొలిచినోల్లం,
కాకతీయుల భద్రకాళి ,మహంకాళి ,
వీరపుత్రులం మేము,కాయం కాలినా కదం తిప్పం మేము.
మా మరణాల మంట నుండి 'జై తెలంగాణ' బతికొస్తుంది,
మా రక్తం బొట్టు బొట్టు నుండి 'జై తెలంగాణ' వినిపిస్తుంది..
తరతరాల తెలంగాణ విప్లవిస్తుంది..