Pages

Friday, November 7, 2008

అలసిన వేళ ఆదరించే అమ్మలా,

అలిగిన వేళ అనునయించే నాన్నలా,

కష్టం లో తోడుగా నిలిచే నేస్తం లా,

ఇష్టం తో కొంటెగా ఏడిపించే ప్రియునిలా,

కన్నీరే రాల్చనివ్వని నా కలల రాకుమరిడిలా,

కౌగిలి లో బంధించుకునే కమ్మని అనుబంధం లా,

దరికి చేరవా ప్రియా ఏకాంతాన నీ కాంత విలపించే ఈ వేళ లో ,

గైకొని పోవా ఇక రెక్కల గుర్రం మీద చుక్కల లోకాలకు ఈ జాము లో !!!!!!!!

Friday, August 1, 2008

రామసేతు ....

భారత జాతి సీతయై , బంగరు జింక ఓడరేవై ,

మారీచుని మాయ నాదం సర్కారు అఫిడ్విటై ,

రామసేతే లక్ష్మనరేఖయై ,దేశ సంస్కృతికి రక్షణ రేఖయై ,

లంకేషుని కపట భిక్షాటన ఈ కాసుల ఒప్పందమై,

కూల్చే రాయి కదిలే భారతావని నైతిక విలువలై,

చెరిపే వంతెన తో మన అస్తిత్వమే నిర్వీర్యమై,

ఇది మరో సీతాపహరణం అయి ,

అడ్డుతగిలే జటాయువు కొరవైనది ,

వంద కోట్ల నరులలో,

రామునికో వానరం కరువైనది!

Saturday, July 12, 2008

మౌనం .....

నీలాకాశపు చినుకు లేఖలకు పుడమి సమాధానం మౌనం,
ఝమ్మనే తుమ్మెద పిలుపుకు పుష్పం సమాధానం మౌనం,
ఎగిసి వచ్చే అలల తాకిడికి తీరం సమాధానం మౌనం ,
ఎదురుచూసే రాధ వలపుకి కృష్ణుని సమాధానం మౌనం ,
తెలుపలేని భావాలకు తీయని రూపం ఈ మౌనం,
నువు నా పై తెలుపని అంగీకారం అనుకోనా నీ మౌనం !

Sunday, June 1, 2008

చెక్కిలి పై చిరుముద్దు....

వెన్నెల లో వర్షం కురిసినట్టుగా,
పగలంతా వెన్నెల విరిసినట్టుగా,
నీలాకాశం వేవేల వర్ణాలు మారినట్టుగా,
పుడమి అంతా గాలి లో తేలినట్టుగా,
చంద్రుడు నేల చేరినట్టుగా,
తారలు ఊయలలు ఊగినట్గ్లుగా,
కొత్తగా,గమ్మత్తుగా,ఏదో మత్తుగా,
మది తూలుతుంది
నీ చెక్కిలి పై చిరుముద్దే పెట్టగా....!

Friday, May 16, 2008

ప్రేమ . . .

పూసే పువ్వుకు తుమ్మెద చుంబనమే ప్రేమ,
వేచే కలువకు చంద్రుని వెన్నెలే ప్రేమ,
నిదురించే శిశువుకు తల్లి లాలనే ప్రేమ,
కన్నె మదికి ప్రియుని కౌగిలే ప్రేమ,
బాధలు కలిగించు భవబంధం ఈ ప్రేమ,
అయినా
జీవితానికి అందం ఈ ప్రేమ .

Tuesday, May 6, 2008

నీ స్నేహం...

చిరునవ్వుల సుమాలను దరికి చేర్చే దారం స్నేహం,
విషాదపు నీలినీడలను తరిమి వేసే కిరణం స్నేహం,
అడుగడుగునా అందాల నందనవనం స్నేహం,
మనసుపై మృదువైన మధువుల సంతకం నీ స్నేహం.

Saturday, May 3, 2008

ఏ రోజు నిన్ను మరువను......?

చేరివచ్చిన వసంతం లో చిగురించిన మన పరిచయం గుర్తొచ్చింది,

కురిసిన హేమంతం లో నీ చల్లని చిరునవ్వు గుర్తొచ్చింది,

వర్షపు జల్లులలో నీ అల్లరి పిలుపులు గుర్తొచ్చాయి,

మండువేసవి లో అందమైన నీ కోపం గుర్తొచ్చింది,

మోడుబోయిన శిశిరం లో నీకు దూరమైన విరహం గుర్తొచ్చింది,

శరదృతువు వెన్నెల లో నీకై చుసిన ఎదురుచూపులు గుర్తొచ్చాయి,

అన్ని ఋతువులు నీ అనురాగ రాగల భరితమైతే,

రోజు నిన్ను మరువను అంతా నీ జ్యాపకాల మయమైతే .......

Friday, May 2, 2008

నా చదువు-నా గెలుపు (ప్రతి వైద్యుని మనోగతం)

పదహారేళ్ళ వయస్సులో పద్దెనిమిది గంటలు కష్టించి సాధించిన చదువు,
పీనుగు తాకి హడలకుండా నిత్యం అధ్యయించిన అమూల్యమైన చదువు,
కాళ్ళు నోస్తున్నా,కళ్లు తిరుగుతున్నా,కదలక నిలబడి నేర్చిన చదువు,
కాలిన తనువు,రక్తపు మడుగు చూసినా,చలించక చిత్తశుద్ధితో నేర్చిన చదువు,
రేయనక, పగలనక ప్రతి నిమిషం అంకితమిచ్చి పొందిన చదువు,
నిందలు,పగిలిన అద్దాలు హేళనగా వెక్కిరించినా, వ్యధ చెందక వృద్ధి చెందిన చదువు,
చిట్టిపపాయికి జన్మనిచ్చి,ఆగిన గుండెకు ఆసరాగా నిలిచి,
సేవ తో సార్ధకత పొందిన నా చదువు,
అలిసిపోక,ఆగిపోక,అనుక్షణం మరో ప్రాణం కోసం ఆరాటపడి,
మానవత్వపు శిఖరాన్ని అవరోహించిన నా చదువు,
......................................................నా గెలుపు.

Thursday, May 1, 2008

అతివ ఆవేదన ...

కానలకు పంపిన కోదండరాముని ఫై,
జానకి కంత జాలి యేల?
జూదం లో తననోడిన ధర్మరాజు ఫై,
ద్రౌపది కంత దయయేల ?
తనను మరచి వెళ్ళిన దుష్యంతుని ఫై,
శకుంతల కంత సహనమేల?
తన దరికి తిరిగి రాని గోపాలుని ఫై,
రాధ కంత అనురాగమేల?
మాధవుని మనసైనదైనా,
హరిశ్చంద్రుని ధర్మపత్నియైనా ,
కాంతకు కన్నీరు తప్పలేదే?
తన సహనమే తనకు శిక్షా?
లోకహితం లోకపావనికి పరీక్షా?
లోకం లో మూడు వంతుల నీరు,
స్త్రీల నయనాలు చెమర్చిన కన్నీరు,
ఇంకా అతివను ఏడిపిస్తే మీరు ,
ధరణి దుఃఖ కడలి లోకి చేజారు. . !

జో జో ....

లేత బుగ్గపై చిట్టి ముద్దులా,
చిట్టి పాపాయికి వెచ్చటి ఒడిలా,
కంటి పాప లో కమ్మటి కలలా,
ఒదిగిపోవా కునుకా ఈ రేయిన,
నా ప్రియమైన నేస్తం విశ్రమించే ఈ వేళనా ........

Wednesday, April 30, 2008

దేవుని న్యాయం... ...

కారునలుపైన కోయిలకు కమ్మని గొంతుక నిచ్చాడు,
రాలిపోయే చినుకుకు ముత్యపు రూపాన్ని ఇచ్చాడు,
కదల లేని రాయిని కళాశిల్పంగా మార్చాడు,
వాడిపోయే పుష్పానికి పూజించే భాగ్యం అందించాడు,
ప్రతి ప్రాణికి లోపాన్ని మరిపించే నిగారింపు ఇచ్చాడు,
నాకు మాత్రం నీ కమ్మని స్నేహాన్ని ప్రసాదించాడు.

Tuesday, April 29, 2008

నీ పిలుపు కై.......

క్షణానికి ఒకసారి అల ఇసుకను కవ్విస్తుంది,

నిమిషానికి ఒకసారి తుమ్మెద పువ్వును చుంబిస్తుంది,

నెలకు ఒకసారి పున్నమి వెన్నెల విరుస్తుంది,

సంవత్సరానికి ఒకసారి వసంతం ప్రకృతిని పలుకరిస్తుంది,

కాని,

ఇన్నాళ్ళుగా వేచివున్న నీ పిలుపు మాత్రం కానరాకుంది.