Pages

Friday, May 16, 2008

ప్రేమ . . .

పూసే పువ్వుకు తుమ్మెద చుంబనమే ప్రేమ,
వేచే కలువకు చంద్రుని వెన్నెలే ప్రేమ,
నిదురించే శిశువుకు తల్లి లాలనే ప్రేమ,
కన్నె మదికి ప్రియుని కౌగిలే ప్రేమ,
బాధలు కలిగించు భవబంధం ఈ ప్రేమ,
అయినా
జీవితానికి అందం ఈ ప్రేమ .

Tuesday, May 6, 2008

నీ స్నేహం...

చిరునవ్వుల సుమాలను దరికి చేర్చే దారం స్నేహం,
విషాదపు నీలినీడలను తరిమి వేసే కిరణం స్నేహం,
అడుగడుగునా అందాల నందనవనం స్నేహం,
మనసుపై మృదువైన మధువుల సంతకం నీ స్నేహం.

Saturday, May 3, 2008

ఏ రోజు నిన్ను మరువను......?

చేరివచ్చిన వసంతం లో చిగురించిన మన పరిచయం గుర్తొచ్చింది,

కురిసిన హేమంతం లో నీ చల్లని చిరునవ్వు గుర్తొచ్చింది,

వర్షపు జల్లులలో నీ అల్లరి పిలుపులు గుర్తొచ్చాయి,

మండువేసవి లో అందమైన నీ కోపం గుర్తొచ్చింది,

మోడుబోయిన శిశిరం లో నీకు దూరమైన విరహం గుర్తొచ్చింది,

శరదృతువు వెన్నెల లో నీకై చుసిన ఎదురుచూపులు గుర్తొచ్చాయి,

అన్ని ఋతువులు నీ అనురాగ రాగల భరితమైతే,

రోజు నిన్ను మరువను అంతా నీ జ్యాపకాల మయమైతే .......

Friday, May 2, 2008

నా చదువు-నా గెలుపు (ప్రతి వైద్యుని మనోగతం)

పదహారేళ్ళ వయస్సులో పద్దెనిమిది గంటలు కష్టించి సాధించిన చదువు,
పీనుగు తాకి హడలకుండా నిత్యం అధ్యయించిన అమూల్యమైన చదువు,
కాళ్ళు నోస్తున్నా,కళ్లు తిరుగుతున్నా,కదలక నిలబడి నేర్చిన చదువు,
కాలిన తనువు,రక్తపు మడుగు చూసినా,చలించక చిత్తశుద్ధితో నేర్చిన చదువు,
రేయనక, పగలనక ప్రతి నిమిషం అంకితమిచ్చి పొందిన చదువు,
నిందలు,పగిలిన అద్దాలు హేళనగా వెక్కిరించినా, వ్యధ చెందక వృద్ధి చెందిన చదువు,
చిట్టిపపాయికి జన్మనిచ్చి,ఆగిన గుండెకు ఆసరాగా నిలిచి,
సేవ తో సార్ధకత పొందిన నా చదువు,
అలిసిపోక,ఆగిపోక,అనుక్షణం మరో ప్రాణం కోసం ఆరాటపడి,
మానవత్వపు శిఖరాన్ని అవరోహించిన నా చదువు,
......................................................నా గెలుపు.

Thursday, May 1, 2008

అతివ ఆవేదన ...

కానలకు పంపిన కోదండరాముని ఫై,
జానకి కంత జాలి యేల?
జూదం లో తననోడిన ధర్మరాజు ఫై,
ద్రౌపది కంత దయయేల ?
తనను మరచి వెళ్ళిన దుష్యంతుని ఫై,
శకుంతల కంత సహనమేల?
తన దరికి తిరిగి రాని గోపాలుని ఫై,
రాధ కంత అనురాగమేల?
మాధవుని మనసైనదైనా,
హరిశ్చంద్రుని ధర్మపత్నియైనా ,
కాంతకు కన్నీరు తప్పలేదే?
తన సహనమే తనకు శిక్షా?
లోకహితం లోకపావనికి పరీక్షా?
లోకం లో మూడు వంతుల నీరు,
స్త్రీల నయనాలు చెమర్చిన కన్నీరు,
ఇంకా అతివను ఏడిపిస్తే మీరు ,
ధరణి దుఃఖ కడలి లోకి చేజారు. . !

జో జో ....

లేత బుగ్గపై చిట్టి ముద్దులా,
చిట్టి పాపాయికి వెచ్చటి ఒడిలా,
కంటి పాప లో కమ్మటి కలలా,
ఒదిగిపోవా కునుకా ఈ రేయిన,
నా ప్రియమైన నేస్తం విశ్రమించే ఈ వేళనా ........